
లండన్, నవంబర్ 3: రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల పెంపు దిశగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలోనూ చురుకుగా ఉన్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి, సోమవారం అక్కడి ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో వరుసగా సమావేశమయ్యారు.ఏపీలో పెట్టుబడుల అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానాలను వివరించిన సీఎం — వచ్చే 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు.గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, ఏవియేషన్ – ప్రధాన దృష్టిఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఏవియేషన్, సెమీకండక్టర్ల రంగాల్లో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” స్థానంలో “స్పీడ్ డూయింగ్ బిజినెస్” పద్ధతిని అవలంబిస్తున్నామని తెలిపారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూములు, అనుమతులు, మౌలిక సదుపాయాల పరంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఆక్టోపస్ ఎనర్జీతో సీఎం భేటీపునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రసిద్ధి గాంచిన ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్‌జెరాల్డ్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అమరావతి, విశాఖల్లో కొత్త టెక్నాలజీలతో విద్యుత్ సరఫరా, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు.ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. విశాఖ సదస్సుకు రావాలని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులను ఆహ్వానించారు.
రోల్స్ రాయస్ ప్రతినిధులతో చర్చలు
తదుపరి సమావేశంలో రోల్స్ రాయస్ గ్రూప్ సీటీఓ నిక్కీ గ్రేడి స్మిత్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏరో ఇంజిన్స్, డీజిల్ ప్రొపెల్షన్ సిస్టమ్స్ ఉత్పత్తిలో ప్రపంచ నాయకత్వం వహిస్తున్న రోల్స్ రాయస్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం సూచించారు.ఓర్వకల్లో మిలటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాలింగ్ (ఎంఆర్ఓ) యూనిట్ ఏర్పాటు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ, తిరుపతిలలో జీసీసీలు ఏర్పాటు చేయాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ ఎకోసిస్టం ఏర్పాటుకు అవకాశం ఉందని వరించారు.సెమీకండక్టర్లు, బ్యాటరీ స్టోరేజీ పెట్టుబడులుతదుపరి సమావేశాల్లో SRAM–MRAM గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీ, శామ్కో హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లయా లతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.సెమీకండక్టర్ తయారీ, అధునిక ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుపై SRAM–MRAM సంస్థ ఆసక్తి చూపిందని సమాచారం. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలోనూ ఏపీలో పెట్టుబడుల అవకాశాలను సీఎం వివరించారు.ఈ భేటీల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పెట్టుబడుల వృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చురుకైన చర్యలు పరిశ్రమల వర్గాల్లో విశేష చర్చకు దారితీశాయి.
 
 






