
గుంటూరు నగరంలోని పూడిక తీసిన ప్రాంతాల్లో వెంటనే డ్రైన్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం కమిషనర్ బాలాజీ నగర్, కృష్ణబాబు నగర్, లక్ష్మీపురం ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను, రోడ్ల ఆక్రమణలను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు నిలిచిపోకుండా పూడికతీసిన మేజర్ డ్రైన్ల ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకుని డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో డ్రైన్ నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో జరుగుతున్న సిసి రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులు పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎమినిటి కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులు పనులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు సమయానికి పూర్తి అయ్యేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.పర్యటనలో డిఈఈ రమేష్, ఎస్ఎస్ ఐజాక్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







