
నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతూ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే కార్యక్రమాలకు సంస్థలు, వ్యక్తులు ముందుకు రావడం అభినందనీయమని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి, నూతన జిమ్ పరికరాల కొనుగోలుకు వెంకటేష్ కన్స్ట్రక్షన్స్ అధినేత పులివర్తి శేషగిరిరావు, ప్రధాన్ హాస్పిటల్స్ సంయుక్తంగా రూ.6లక్షలు విరాళం అందించారు. మంగళవారం మేయర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు చేతుల మీదుగా కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ కన్నసాని బాజికి చెక్ అందజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి దాతల సహకారం ఎంతో ముఖ్యమని, పులివర్తి శేషగిరిరావు, ప్రధాన్ హాస్పిటల్స్ సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ప్రశంసనీయమని అన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఇప్పటికే వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయబడిందని, ఇతరప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాల ఏర్పాటుకు దాతలు సహకరించాలని కోరారు.కార్యక్రమంలో ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ కోటపాటి నాగేశ్వరరావు, ట్రాక్ సెక్రటరీ బెజవాడ శివరామకృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షులు ఇమడాబత్తిని కోటేశ్వరరావు, అన్నం గంగాధర్, గల్లా గురుపాదం, రవీంద్ర, సత్యనారాయణ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.







