
ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ, కూన రవి కుమార్ అధ్యక్షతన మంగళవారం పర్యటించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్, రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్, ఏపీ ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి కార్పొరేషన్ కార్యకలాపాలపై కమిటీ సమీక్షించింది. కమిటీ చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి నిధులు పొందుతున్న ప్రతి సంస్థ విధిగా గణాంకాలు, ఆడిట్, విత్తం వివరాలు పక్కాగా ఉండాలన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలోగా తనిఖీలు పూర్తి కావాలని స్పష్టం చేశారు. శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల పని సామర్థ్యం, జవాబుదారీతనాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. సంస్థలు మంచి పనితీరుతోపనిచేయడం వలన ఆదాయం పెరుగుటకు అవకాశం ఉందని తెలిపారు. ప్రతి సంస్థ వార్షిక కార్యకలాపాలు, వార్షిక ఆదాయం, వ్యయంపై విధిగా నివేదికలు సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సంస్థ కార్యకలాపాలను క్షుణ్ణంగా విచారణ చేశారు. ఆడిట్ అభ్యంతరాలను సైతం సంస్థలు సమర్పించాలని ఆయన చెప్పారు. సంస్థలు నిర్దేశిత కాలంలో సమర్పించక పోవడానికి అంతర్యాలను ఆరా తీసారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ 182 సంస్థల కార్యకలాపాలను విచారణ చేయనుందని, ఇప్పటి వరకు 30 సంస్థలను పరిశీలించామని తెలిపారు. ఎపి అటవీ అభివృద్ధి సంస్థ గత 8 సంవత్సరాలుగా గణాంకాలు నిబంధనల మేరకు సమర్పించక పోవడం పట్ల ప్రశ్నించారు. రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు వార్షిక నివేదికలు సమర్పించక పోవడం పట్ల ప్రశ్నించారు.ఆడిట్ అభ్యంతరాలను సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఆడిట్ అభ్యంతరాలకు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలకు సిఫార్సు చేయాలన్నారు. రాష్ట్రంలో అటవీ అభివృద్ధి సంస్థను మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. అటవీ శాఖ ఎకో టూరిజం ప్రాజెక్టులను పిపిపి పద్ధతిలో నిర్వహణకు సంబంధించిన అవకాశాలను పరిశీలించాలన్నారు. ఎపి ఎయిర్ పోర్టుల అభివృద్ధి సంస్థ ఆరు సంవత్సరాలుగా ఆడిట్ చేయకపోవడాన్ని ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి నివేదికలు తాజా పరచాలని ఆదేశించారు. ఎపి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ హాజరు కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమీక్షను నిర్వహించలేదు. ఎపి అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎస్.ఎస్.శ్రీధర్ మాట్లాడుతూ వచ్చే మార్చి మాసంతానికి గణాంకాలు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గిరీషా మాట్లాడుతూ సంస్ధ చేపట్టిన అంశాలను వివరించారు. 293 పనులను రూ.14,820 కోట్లతో చేస్తుందని, ఇప్పటి వరకు రూ.3947 కోట్ల విలువ గల పనులు పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. ఎపి ఎయిర్ పోర్టుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ రెండు, మూడు వారాల్లో గణాంకాలు అప్ డేట్ చేస్తామన్నారు. బోర్డు మీటింగ్ సైతం ఈ నెల 27న జరుపనున్నామని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభించుటకు, కర్నూలు ఎయిర్ పోర్ట్ కు మరిన్ని ఎక్కువ విమాన రాకపోకలు పెంచుటకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో అదనంగా తొమ్మిది ఎయిర్ పోర్ట్ లు వివిధ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులుతెనాలి శ్రావణ్ కుమార్, గిడ్డి సత్యనారాయణ, కుమార్ రాజా వర్లా, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, బుమ్హిరెడ్డి రామగోపాల రెడ్డి, కాంట్రాక్టర్ ఇషాక్ భాషా, గౌతు శిరీష ఐతబతుల ఆనందరావు, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, డిప్యూటీ కలెక్టర్ విజయ లక్ష్మి, కమిటీ సహాయ కార్యదర్శి యు.నాగమునయ్య, ప్రిన్సిపాల్ ఆడిట్ అండ్ అకౌంట్స్ జనరల్ కార్యాలయ సీనియర్ ఆడిట్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.







