
krishna gilla news:మొంథా తుఫాన్ బాధిత రైతులకు జగన్ పరామర్శ – కూటమి సర్కార్‌పై సీరియస్ వ్యాఖ్యలు — “ప్రభుత్వం నుంచి మీకు ఎంత సాయం అందింది?” అని ప్రశ్నించారు. రైతుల వేదన విన్న అనంతరం ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. “రాష్ట్రంలో రైతు పరిస్థితి తెలుసుకోవాలంటే ఒక్కసారి నేలమీదికి వచ్చి చూడండి. ఈ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా, నిర్దయగా వ్యవహరిస్తోంది” అంటూ విమర్శలు గుప్పించారు.

జగన్ మాట్లాడుతూ — “గోదావరి జిల్లాల నుంచి కర్నూల్ వరకు తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. పత్తి, మొక్కజొన్న, బత్తాయి పంటలు నాలుగు లక్షల ఎకరాల్లో మునిగిపోయాయి. రైతుల 6 నెలల కష్టం నీటమునిగింది” అని పేర్కొన్నారు.తన ప్రభుత్వం కాలంలో రైతులకు అందించిన సహాయాన్ని గుర్తు చేస్తూ జగన్ అన్నారు — “వైసీపీ హయాంలో ఒక్క రైతు కూడా భయపడలేదు. అందరికీ భరోసా ఉంది. డబ్బులు సమయానికి వచ్చి తర్వాత సీజన్ పెట్టుబడి పెట్టే స్థితి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం రైతుల వెన్ను విరిచింది” అని ధ్వజమెత్తారు.

ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సాయం, ధరల స్థిరీకరణ నిధి వంటి అంశాలను ప్రస్తావిస్తూ — “18 నెలల చంద్రబాబు పాలనలో 16 సార్లు ప్రకృతి విపత్తులు జరిగాయి. కానీ ఒక్క రైతుకైనా సాయం అందిందా? ఉచిత పంట బీమా కూడా రద్దయింది. రైతులు ఎరువులు బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు” అని విమర్శించారు.ఆర్బీకేలు, సచివాలయాల అనుసంధాన వ్యవస్థతో గతంలో రైతులకు తక్షణ నష్టపరిహారం అందేదని గుర్తుచేశారు. “మార్కెట్‌లో ధరలు పడిపోయినా, మార్క్‌ఫెడ్ ద్వారా పోటీ సృష్టించి గిట్టుబాటు ధరలు ఇచ్చాం. సీఎం యాప్ సాయంతో రైతులకు అన్నీ అందుబాటులో ఉండేవి. మేము 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం” అని జగన్ తెలిపారు.మొంథా తుఫాన్ తర్వాత రైతుల బాధలను ప్రత్యక్షంగా విని, వారిలో నమ్మకం కలిగించడానికి జగన్ చేసిన పర్యటనకు స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.







