
విజయవాడ: 04-11-25:-రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో నవంబర్ 4న 2వ, 4వ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 51 కేసులు నమోదు చేసి, మద్యం సేవించి వాహనాలు నడిపిన చోదకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఆరవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి శ్రీ జి. లెనిన్ బాబు గారు విచారణ అనంతరం తీర్పు వెలువరించారు.
ఈ సందర్భంగా 6 మందికి ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున రూ.90,000, మిగిలిన 45 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రూ.4,50,000 జరిమానా విధించి, మొత్తం రూ.5.40 లక్షలు విధించడం జరిగింది.ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజూ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నియమాలు, మోటార్ వాహన చట్టాలను కచ్చితంగా పాటించి, సురక్షితంగా ప్రయాణం చేయాలని పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ సూచించారు.







