
పాట్నా, నవంబర్ 6:-బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఈ విడతలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 1,192 మంది పురుషులు, 122 మంది మహిళలు కాగా, 3.75 కోట్లకు పైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం మొత్తం 3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు, 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో, 8,608 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు. అదనంగా 320 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 926 మహిళా నిర్వాహక కేంద్రాలు, 107 దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు.సాధారణ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుండగా, నక్సల్ ప్రభావిత ఆరు నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటలకే ముగుస్తుంది.ఈ విడతలో పోలింగ్ జరగుతున్న ప్రధాన జిల్లాల్లో ఖగారియా, ముంగేర్, నలంద, పాట్నా, భోజ్‌పూర్, దర్భంగా, ముజఫర్‌పూర్, సీవాన్, వైశాలి, సమస్తిపూర్, బేగుసరాయ్, బక్సర్ జిల్లాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 15 బెటాలియన్లకు పైగా పోలీసు, పారామిలిటరీ బలగాలు మోహరించగా, ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పాట్నా జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద భద్రతా సిబ్బందిని నియమించారు.ఎన్నికల అధికారులు మాట్లాడుతూ, “పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో కొనసాగుతోంది. ఓటర్లు భయాందోళనలేమి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు” అని తెలిపారు.







