
హైదరాబాద్:06-11-25:-ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం వినూత్నంగా నిరసన చేపట్టింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద విద్యార్థులు నల్ల కండువాలతో పుస్తకాలు చదువుతూ ధర్నా నిర్వహించారు.

బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం కమిటీలు, సమీక్షల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడంతో అనేక కళాశాలలు బంద్ పాటిస్తున్నాయని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలో భాగంగానే ఈ నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు.కళాశాలల యాజమాన్యాలు బకాయిల కోసం అడిగితే విజిలెన్స్ దాడులతో భయపెడుతున్నారని వేముల రామకృష్ణ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







