
గుంటూరు రూరల్ జొన్నలగడ్డ గ్రామంలో దెబ్బతిన్న పత్తి పైరులను గురువారం సిపిఎం, రైతు సంఘాలు పర్యటించారు. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, కంచుమాటి అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తుఫానుకు ముందు ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రులు తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రతి రైతును ఆదుకుంటామని ఆర్భాటంగా పత్రికల్లో, టీవీల్లో ప్రచారం ఉదరగొట్టారన్నారు. కానీ ఆచరణలో శూన్యంగా ఉందన్నారు. జిల్లాలో సుమారు 60 ఎకరాలు పత్తి సాగు చేయగా అందులో సగం పైగా పూర్తిగా పత్తి దెబ్బ తిన్నది అన్నారు. కానీ పంట నష్టం అంచనాల్లో ఏమాత్రం దెబ్బతిన్న ఫైర్లను పరిశీలించకుండా మొక్కుబడిగా హడావుడిగా తప్పుడు రిపోర్టులతో పంట నష్టం తయారు చేయడం జరిగింది. గ్రామంలో క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసిన దాఖలాలు లేవన్నారు. పత్తి ఊరకెత్తిపోయి పూర్తిగా దెబ్బతినగా పై ఆకుల మాత్రమే అక్కడక్కడ పచ్చగా కనిపిస్తున్నాయన్నారు. దీని పరిగణనలోకి తీసుకొని రిపోర్టులు ఇస్తున్నారు అన్నారు. ప్రభుత్వం ఇది పరిశీలించకుండా పంట నష్టం జరగలేదని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు పంట నష్టం అంచనాలను వేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. మండల స్థాయిలో పత్తి కొనుగోలు కేంద్రాలు పేట్టి నిబంధనల ప్రకారం ఎనిమిది శాతం 8% మాత్రమే పరిగణలో తీసుకోవటం మార్చి, 15% నుంచి 18 శాతం వరకు తేమశాతాన్ని పరిగణలో తీసుకుంటే ఈ తుఫానుకు దెబ్బతిన్న రైతులకు కొంత మేరకు న్యాయం జరుగుతుందన్నారు. దీని ప్రకారం మద్దతు ధర ప్రకారం 8110 రూపాయలకే పాడైపోయిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేయాలన్నారు.పంటల భీమా పథకాన్ని అమలుపరచినందుకు రాష్ట్ర ప్రభుత్వమే దీనికి పూర్తిగా బాధ్యత వహించి రైతులును నష్టం నుంచి బయటపడే విధంగా చేయాలన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేయాలన్నారు.అదేవిధంగా కౌలు రైతులు కూడా గుర్తించి పంట పండించిన వారికే నష్టపరిహారం చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులతో రైతు సంఘాలు ఆందోళన చేపడతామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు తలసీల సుధాకర్, ఇమ్మడి నాగేశ్వరరావు, కంజుల విఠల్ రెడ్డి, బాణావత్ భద్రయ్య, జోషి లు పాల్గొన్నారు.







