
నగరంలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ శ్రీనివాసరావుతోటలోని 69, 70, 71 వార్డ్ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత హాజరు రిజిస్టర్లు తనిఖీ చేసి సచివాలయ కార్యదర్శుల హాజరు సక్రమంగా ప్రతి రోజు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ సర్వేలు లేదా ఇతర కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని, సెలవులు తమ నోడల్ లేదా విభాగ అధికారి ద్వారా మంజూరు చేసుకోవాలన్నారు. కార్యదర్శులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించకుంటే చర్యలు తప్పవన్నారు. స్థానిక సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి సచివాలయం పరిధిలోనే చర్యలు తీసుకోవాలని, అప్పుడే సిబ్బంది స్థానికులకు సత్సంబంధాలు ఉంటాయన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ప్రజల సర్వీస్ రిక్వస్ట్ లు పెరగాలన్నారు. ప్రతి కార్యదర్శి తమ విభాగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని తెలిపారు. అనంతరం నల్లచెరువు, ఐపిడి కాలనీ, కొబ్బరికాయల సాంబయ్య కాలనీ, పట్నం బజార్ ల్లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.పర్యటనలో కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







