
హైదరాబాద్, నవంబర్ 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఖైరతాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా భారీ ఏర్పాట్లు చేశారు.విజయవాడకు చెందిన సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వర ప్రసాద్, హుసైన్ సాగర తీరం వద్ద మొట్టమొదటిసారిగా నెల్లూరు నుంచి తెచ్చిన ఇసుకతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాన్ని స్యాండ్ ఆర్ట్ రూపంలో ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి స్యాండ్ ఆర్ట్‌ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో సైకత శిల్పి కళను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను ప్రతిబింబించేలా సైకత శిల్పుల సహకారంతో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.ఖైరతాబాద్ అంబేద్కర్ విగ్రహం ముందు టీపీసీసీ సెక్రటరీ మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు స్టేషనరీ, జీకే పుస్తకాలు పంపిణీ చేశారు.

రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జన్మదినాన్ని పండుగలా జరుపుకుంటున్నారని మధుకర్ యాదవ్ తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.






