
కళ్యాణదుర్గం:నవంబర్ 8:– విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన అనంతపురం జిల్లా రెండవ రోజు పర్యటనలో భాగంగా కళ్యాణదుర్గం పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో 71వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.ప్రజలతో ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్, కార్యకర్తలు మరియు సాధారణ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మస్కట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న షేక్ జుబేదాను క్షేమంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లుకు చెందిన షేక్ షబానా మంత్రి వద్ద వినతిపత్రం అందజేశారు. అనంతపురానికి చెందిన మదమంచి ప్రవీణ్ కుమార్ తన ఇద్దరు కుమార్తెల ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం కోరారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు తమ క్రమబద్ధీకరణపై న్యాయం చేయాలని మంత్రి లోకేష్‌ను కోరారు. పుట్టపర్తి మండలం గువ్వలకుంటపల్లి గ్రామానికి చెందిన ఈ.సురేంద్ర రెడ్డి తన ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు.మౌక్తికాపుర గ్రామానికి చెందిన ముస్లీం మైనార్టీ కుటుంబాలు తమ స్మశాన స్థలం ఆక్రమణపై మంత్రి వద్ద వినతిపత్రం సమర్పించాయి. అదేవిధంగా, శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.అన్ని వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా ఇచ్చారు.







