
నరసరావుపేట: నవంబర్ 08:-భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డిని సత్కరించిన కార్యక్రమం శనివారం నరసరావుపేటలో ఘనంగా జరిగింది. లూథరన్ అంధుల ఉన్నత పాఠశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయం నుంచి లూథరన్ పాఠశాల వరకు భారీ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు స్వయంగా ర్యాలీలో పాల్గొని అజయ్ కుమార్ రెడ్డిని సత్కరించారు.
2002లో ఈ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించి, క్రికెట్ ప్రతిభతో జాతీయ స్థాయికి ఎదిగిన అజయ్ కుమార్ రెడ్డి, భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా మూడు సార్లు వరల్డ్ కప్ విజయం అందించిన ఘనత సాధించారు. 2012, 2017 టీ20, 2018 వన్డే వరల్డ్ కప్‌లను భారత్‌కు అందించిన అజయ్, 2023లో అర్జున అవార్డు కూడా అందుకున్నారు. బీ2 కేటగిరీలో (పాక్షిక దృష్టి లోపం) ఆడుతూ 21 అంతర్జాతీయ టోర్నీల్లో 16 మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 15 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు, 213 వికెట్లు సాధించారు.సత్కార సభలో ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ – “మన పల్నాడు గర్వకారణమైన అజయ్ కుమార్ రెడ్డి అంధుల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం రాశారు. ఆయన విజయాలు ప్రతి దివ్యాంగుడికి స్ఫూర్తి. ఈ సత్కారం ఆయన సేవలకు చిరస్మరణీయ గుర్తు” అని తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, దివ్యాంగ క్రీడాకారులు అజయ్‌ను ఘనంగా అభినందించారు. అజయ్ భావోద్వేగంతో మాట్లాడుతూ – “నా విద్యకు పునాదిగా నిలిచిన ఈ పాఠశాల, నరసరావుపేట ప్రజలు నాకు ఎప్పటికీ మద్దతు ఇచ్చారు. నా విజయాలన్నీ అందరి సహకార ఫలితమే” అని అన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉమ్మడి కూటమి ప్రతినిధులు పాల్గొని అంధుల క్రీడలను ప్రోత్సహించాలని, దివ్యాంగులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు.







