
పెదకాకాని: నవంబర్ 9:-“అనారోగ్యమే నిజమైన పేదరికం… అందుకే ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర కంటి ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ — “హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ” మా ప్రభుత్వ నినాదమని పేర్కొన్నారు. – WATCH ON LIVE
ఐదు దశాబ్దాలుగా శంకర ఐ ఫౌండేషన్ పేదలకు నిస్వార్థంగా కంటి చికిత్సలు అందిస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు.“మానవ సేవే మాధవ సేవ” అన్న స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా కంటి ఆస్పత్రులు స్థాపించి సేవలు అందిస్తున్న కంచి కామకోటి పీఠాన్ని సీఎం ప్రశంసించారు. “ఇలాంటి సేవా సంస్థలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.1977లో ప్రారంభమైన శంకర కంటి ఆస్పత్రి ఇప్పటివరకు 30 లక్షల మందికి ఉచిత శస్త్రచికిత్సలు, 70 లక్షల చిన్నారులకు నేత్రపరీక్షలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. రోజుకు సగటున 750 ఉచిత శస్త్రచికిత్సలు, దేశవ్యాప్తంగా 14 ఆస్పత్రులు, 2,576 పడకలు, 2,268 మంది సిబ్బందితో సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు.
గుంటూరులోని శంకర ఆస్పత్రి ఇప్పటివరకు 4 లక్షలకు పైగా ఉచిత శస్త్రచికిత్సలు, 9 లక్షల మందికి పరీక్షలు నిర్వహించిందని, రోజుకు 3,000 మంది రోగులకు సేవలు అందిస్తోందని తెలిపారు. “రెయిన్‌బో ప్రోగ్రామ్” ద్వారా పిల్లల కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమన్నారు.‘గిఫ్ట్ ఆఫ్ విజన్’ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు 32 వేల కంటి శిబిరాలు నిర్వహించడమే వారి సేవా గుణానికి నిదర్శనమని సీఎం అభినందించారు.రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కాపాడడం తమ ప్రధాన లక్ష్యమని, అందుకోసం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల భీమా, కుటుంబానికి రూ.25 లక్షల విలువైన వైద్య సేవలు అందించే ప్రణాళిక అమలులో ఉందని వెల్లడించారు.
టాటా గ్రూప్ సహకారంతో ‘సంజీవని’ డిజిటల్ నెర్వ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల హెల్త్ రికార్డులు ఆన్‌లైన్‌లో ఉంచి ప్రివెంటివ్, క్యూరేటివ్ హెల్త్ మోడల్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు.సీఎం చంద్రబాబు మాట్లాడుతూ — “ధర్మం, జ్ఞానం, సేవ అనే మూడు మూల సిద్ధాంతాలతో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ పీఠాన్ని నడిపిస్తున్నారు. పేదలకు సేవే పరమావధిగా భావించే ఇలాంటి సంస్థలతో ప్రభుత్వం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది” అన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి ఆస్పత్రి విభాగాలను పరిశీలించి, నిర్వహకుల నుండి ఐ బ్యాంక్, సర్జరీ సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వాహకులు సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి, తంజావూరు పెయింటింగ్ బహూకరించారు.ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, శంకర ఐ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.







