
చిత్తూరు: నవంబర్ 9:-చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రం ఆదివారం చలాకీగా మారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించడంతో అక్కడ సందడి నెలకొంది.కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతోపాటు, ఇంతకుముందే శిక్షణ పొందుతున్న మూడు ఏనుగుల విన్యాసాలు పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకున్నాయి. ఏనుగులు వరుసగా వచ్చి ఘీంకారం చేస్తూ డిప్యూటీ సీమకు సెల్యూట్ ఇవ్వడం అందరినీ ఆకర్షించింది.అడవిలో కలపను ఏనుగుల సహాయంతో ఎలా తరలిస్తారో, మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటిని ఎలా కట్టడి చేస్తారో ప్రత్యక్షంగా చూపించగా, పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్‌ను కూడా పరిశీలించారు. అనంతరం ఏనుగులకు స్వయంగా బెల్లం ఆహారం అందించి గజరాజుల ఆశీర్వచనం తీసుకున్నారు.
తర్వాత పవన్ కళ్యాణ్ ముసలమడుగు ఏనుగుల క్యాంపును ప్రారంభించి, గజారామం నగర వనానికి పునాది రాయి వేశారు. సౌరశక్తితో పనిచేసే ఆధునిక ఫారెస్ట్ ఫెన్సింగ్ వ్యవస్థ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే మియావకీ తరహా ప్లాంటేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్, ఉసిరి మొక్కను నాటారు. మొక్కల విస్తరణ విధానం, పొదల ఏర్పాటు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.కుంకీ ఏనుగులను సంరక్షిస్తున్న మావటీల పనితీరును మెచ్చుకున్న పవన్ కళ్యాణ్, వారికి తన సొంతంగా రూ.50 వేల నగదు బహుమానం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, సలహాదారు మల్లికార్జునరావు, చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, కన్జర్వేటర్లు యశోద బాయి, డీఎఫ్ఓ సుబ్బురాజు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







