పెట్రోల్ కొరత పై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని, పెట్రోల్ బంకుల వద్ద ప్రభుత్వ కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. సోమవారం పెట్రోల్ కొరత పై వస్తున్న వార్తల నేపథ్యంలో మాధవి బృందావన్ గార్డెన్స్ సెంటర్, లాడ్జి సెంటర్ సహా పలు పెట్రోల్ బంకులను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బంకు నిర్వాహకులతో మాట్లాడి నిల్వ వివరాలు తెలుసుకొని నిల్వ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ప్రస్తుతం కనిపిస్తున్న పెట్రోల్ కొరత అసలు కొరత కాదని, కేవలం కృత్రిమ కొరత వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కొన్ని ప్రచారాల కారణంగా ప్రజలు ముందుగానే భారీగా పెట్రోల్ నింపుకోవడంతో అవసరం ఒక్కసారిగా పెరిగి, బంకులపై ఒత్తిడి ఏర్పడిందని చెప్పారు. దుకాణాలు మూసివేయడానికి కూడా ఇదే కారణమని, ముందస్తుగా నిల్వలు కొనుగోలు చేయడం వల్ల సాధారణ సరఫరా కంటే ఎక్కువ అవసరం ఏర్పడిందని నిర్వాహకులు వెల్లడించినట్టు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్రోల్ బంక్ యజమానులు, ఆయిల్ సంస్థలతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఒక గ్రామ రెవెన్యూ అధికారి, ఒక పోలీసు సిబ్బందిని నియమించి కట్టుదిట్టమైన పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఎమ్మెల్యే గళ్ళా మాధవి చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.నియోజకవర్గంలోని బంకుల పరిస్థితిని పరిశీలించగా, చాలా బంకులు సాధారణంగా పనిచేస్తున్నాయని, రోజువారీ విక్రయాల కంటే ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. కొన్ని బంకుల్లో ఇప్పటికే ప్రభుత్వం ఒకేసారి అధికంగా పెట్రోల్ నింపకుండా నియంత్రణలు విధించిందని, కార్లకు ₹1000 వరకు మాత్రమే, ద్విచక్ర వాహనాలకు ₹100-₹200 వరకు మాత్రమే నింపాలని సూచనలు జారీ చేసినట్టు చెప్పారు. ప్రజలు భయంతో ముందుగానే ట్యాంకులు నింపుకోవడం వల్ల నిజంగా అవసరమైన వారికి ఇబ్బంది కలగకుండా చూడడమే ఈ నియంత్రణల ఉద్దేశమని స్పష్టం చేశారు. కొన్ని బంకుల్లో “నిల్వ లేదు” బోర్డులు కనిపించడానికి కారణం గత రాత్రి భారీ అవసరం వల్ల నిల్వ అయిపోవడమేనని, ప్రస్తుతం కొత్త ఆర్డర్లు పెట్టి సరఫరా కొనసాగుతోందని తెలిపారు. అలాగే ఆయిల్ కంపెనీలు ముందుగా అప్పుగా సరఫరా చేయకుండా, అదే రోజున చెల్లింపు చేయాల్సిన విధానం అమలులోకి రావడంతో కొంత ఆలస్యం జరుగుతోందని వివరించారు. అయితే ఈరోజు రాత్రి లేదా రేపటి ఉదయం నాటికి ఎక్కువ శాతం బంకులు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. ప్రజలు భయపడకుండా ప్రశాంతంగా ఉండాలని, అవసరానికి మించిన పెట్రోల్ నిల్వ చేయకుండా సహకరించాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు కలిసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసా ఇచ్చారు.
GUNTUR CITY NEWS: పెట్రోల్ కొరతపై అపోహలు సృష్టించవద్దు – బంకుల వద్ద తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగుతుంది

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
overcast clouds
31° _ 31°
70%
2 km/h
Tue
30 °C
Wed
33 °C
Thu
30 °C


