
గుంటూరు: నవంబర్ 10 :- గుంటూరు నగరంలోని పలు డివిజన్లలో సుమారు ₹66.38 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నగర పాలక సంస్థ స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. సోమవారం మేయర్ ఛాంబర్‌లో జరిగిన స్థాయి సంఘ సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, స్థాయి సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో నగరంలోని వివిధ డివిజన్లకు సంబంధించిన మొత్తం 173 అభివృద్ధి అంశాలపై విపులంగా చర్చించి ఆమోదం తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి పైపులైన్లు, గ్రీనరీ వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు మేయర్ రవీంద్ర తెలిపారు.
మేయర్ మాట్లాడుతూ, “గుంటూరు నగరంలో కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, విలీన గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. పలు పనులకు ఇప్పటికే శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి,” అన్నారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నతాధికారుల క్షేత్ర స్థాయి పర్యటనల్లో గుర్తించిన అవసరాల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో ఆమోదించామని ఆయన పేర్కొన్నారు.సమావేశంలో స్థాయి సంఘ సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వరరావు, దాసరి లక్ష్మి దుర్గ, ముప్పవరపు భారతి, నగర పాలక సంస్థ వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.






