నవ్యాంధ్రప్రదేశ్ లక్ష సాధనలో విద్యా ప్రమాణాలు అత్యంత ప్రధానమని విద్యార్థి దశలో విద్యార్థులు తమ మేధస్సుకు వదిలిపెట్టేందుకు, భావి శాస్త్రవేత్తలుగా రాణించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.స్థానిక పాత గుంటూరు కన్నా స్కూల్ విద్యార్థుల “ఆల్రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్ -2025″ను ఎమ్మెల్సీ అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్ని గత నాలుగున్నర దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల స్థాపించి వేలాది మందిని భారత పౌరులుగా తీర్చి దిద్దుతున్న కన్నా మాస్టర్ సేవలు వర్తమాన, భావితరాలకు ఆదర్శప్రాయం అన్నారు. కన్నా విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ కన్నా మాస్టర్ మాట్లాడుతూ అధునాతన శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి దోహదం చేస్తున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, బాటని, తెలుగు నమూనాలు 300 కు పైగా విద్యార్థులే స్వయంగా తయారు చేసుకొని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. వైజ్ఞానిక ప్రదర్శనలతోపాటు మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్కిట్స్, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాట్లాడే రోబోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రతన్ టాటా బయోగ్రఫీ, ఉపగ్రహ వీక్షణాలు, అయోధ్య రామ మందిరం, అలల నుండి గాలి, మంచినీరు, కరెంటు తయారీ, మనిషి శరీర నిర్మాణం, తదితర అంశాలలో ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం, విజ్ఞానం, వినోదం అన్ని ఒకే చోట ఆస్వాదించేలా విద్యార్థుల ప్రదర్శనలు ఉన్నాయన్నారు. అన్ని పాఠశాలల విద్యార్థులకు శని ఆదివారాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉచితంగా ప్రదర్శన వీక్షించే అవకాశం కల్పించమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర రావు, అడ్మినిస్ట్రేటర్ కే శ్రీదేవి, ఇన్చార్జి హెచ్ఎం రత్నకుమారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
233 1 minute read