
గుంటూరు నగరంలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, పూర్తి చేసిన పనులకు సంబందించిన బిల్లుల చెల్లింపుకు నిధి పోర్టల్లో అప్ లోడ్ చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన అత్యవసర సమీక్షా సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నగరాభివృద్ధికి దోహదపడేలా విస్తృతంగా అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపామన్నారు. కాని పలు కారణాలతో ఆయా పనులు పూర్తీ కాకపోవడం వలన ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత 5 నెలల కాలంలో షుమారు రూ.40 కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించామని తెలిపారు. పూర్తీ చేసిన అభివృద్ధి పనుల బిల్లులలను నిధి పోర్టల్లో అప్ లోడ్ చేయడం ద్వారా పని పూర్తి చేసిన ప్రతి కాంట్రాక్టర్ కి పేమెంట్ అందుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో ఏ సమస్య ఉన్న తక్షణం తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. కమిషనర్ మాట్లాడుతూ మంగళ, బుధవారాల్లో ఏఈల వారీగా పూర్తి అయిన అభివృద్ధి పనులకు సంబందించిన బిల్స్ ని నిధి పోర్టల్లో అప్ లోడ్ చేయడమే అధిక ప్రాధ్యాన్యతగా చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 280 పనుల అగ్రిమెంట్లకు ఆమోదం తెలిపామని, 115 పనులను నేరుగా ఇన్స్పెక్షన్ చేశామని తెలిపారు. ఇన్స్పెక్షన్ చేసి ఆమోదం తెలిపిన పనులకు సంబందించిన బిల్స్ ని నిధి పోర్టల్లో వెంటనే అప్ లోడ్ చేయాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టిన ప్రతి కాంట్రాక్టర్ కి బిల్స్ చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో ఎస్ఈ (ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, ఈఈలు కోటేశ్వరరావు, విష్ణు, వేణు, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.







