
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేకపోవడం విచారకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. యధాతధంగా ఈ బడ్జెట్ లో కూడా ఏపీకి మొండిచేయి దక్కింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నిధులు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, కేంద్రీయ విద్యాసంస్థలకు నిధులు వంటి వాటిపై కనీసం నోరు మెదపలేదు. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా బీహార్ కు మాత్రం మకాస్ బోర్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇనిస్టిట్యూట్, ఐఐటి పాట్నా, గ్రీన్ ఎయిర్ పోర్టులు, నీటి రవాణా కోసం మిధిలాంచెల్లో కాలువ నిర్మాణం వంటి పలు వరాలు ప్రకటించారు. రైతుల పంటలకు సంబంధించి కనీస మద్దతు ధర గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యవసాయంలో వెనుకబడిన జిల్లాలకు అమలు చేసే ధన, ధాన్య, కృషి యోజన పథకం కేవలం 100 జిల్లాలకే వర్తింప చేస్తూ చేతులు దులుపుకున్నారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించటం, ప్రభుత్వ రంగ సంస్థలలోని పెట్టుబడులను రెండో విడతగా ఉపసంహరించాలనుకోవటం, ఆస్తుల విక్రయం, ప్రైవేటు భాగస్వామ్యంతో మారిటైం మిషన్, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించటం వంటి నిర్ణయాలు కార్పొరేటర్ అనుకూల అంశాలుగా ఉన్నాయి. దీనిని బట్టి కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకు కేంద్రం మరింత వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తుందనేది స్పష్టమవుతుంది. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలుచేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పటం దుర్మార్గం. ఇప్పటికే విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ ఛార్జీలను రకరకాలుగా పెంచి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. విద్యుత్ రంగ బాధ్యతలను రాష్ట్రాల నుండి తప్పించే కుట్రలో భాగమే విద్యుత్ సంస్కరణల అమలుగా గోచరిస్తున్నది.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మల్టీ సెక్టర్ సేవలను వినియోగిస్తామని చెప్పారేగాని ఉపాధి హామీ గురించి నోరు మెదపలేదు. ఉత్పత్తిరంగ అభివృద్ధి, కొనుగోలు శక్తి పెంచే చర్యలు బడ్జెట్ ప్రసంగంలో కనిపించలేదు. డ్వాక్రా మహిళలు, ఎంఎస్ఎమ్ఈలకు రుణాలు పెంచి ఇస్తామని చెప్పటం వారి చేత అప్పులు చేయించటమే లక్ష్యంగా గోచరిస్తున్నదని ఆయన వెల్లడించారు.







