
బాపట్ల:రేపల్లె :11-11-25:-రేపల్లె పట్టణంలో ముంతా తుఫాన్ కారణంగా పేదల నివాస ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్ డిమాండ్ చేశారు.గ్రీవెన్స్ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ (పాత జగన్ కాలనీ), 20వ వార్డు ఐబీపీ పెట్రోల్ బంక్ వెనుక కాలనీలలో ఇప్పటికీ వర్షపు నీరు నిల్వ ఉందని, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వీధుల్లో నీరు నిల్వ ఉండటంతో పాముల భయం, దోమల ఉత్పాతం, దుర్వాసనల వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, పట్టణంలో పారిశుధ్య పనులు, బ్లీచింగ్ సక్రమంగా నిర్వహించలేదని మణిలాల్ విమర్శించారు.
పునరావాస కేంద్రాల్లో పేర్లు నమోదైన అర్హులకు నష్టపరిహారం ఇవ్వడంలో రాజకీయ జోక్యంతో అర్హులను తొలగించారని ఆయన తెలిపారు. వితంతువులు, వికలాంగులు వంటి ఆధారరహిత కుటుంబాలకు కూడా నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.అధికారులు స్థానిక నాయకుల ఒత్తిడికి లొంగి డాక్యుమెంట్లు తీసుకున్నా నష్టపరిహారం ఇవ్వకపోవడం విచారకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మణిలాల్ డిమాండ్ చేశారు.పేదప్రజలు నివాసమున్న ప్రాంతాల్లో తక్షణం నీరు తొలగించి, బ్లీచింగ్ నిర్వహించి, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు, సిపిఎం నాయకులు వి. ధనమ్మ, కే. నాంచారమ్మ, ఎం.డి. ఫర్జానా, కె. సింధుదేవి, డి. అగస్టీన్, కే. ఆశీర్వాదం, బి. రాము తదితరులు పాల్గొన్నారు.







