
బాపట్ల: నవంబర్ 11:-మొంథా తుపాను వల్ల బాపట్ల జిల్లాలో జరిగిన భారీ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని కేంద్ర బృందం సభ్యురాలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమి బసు తెలిపారు.మంగళవారం జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందంలో పౌసుమి బసుతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ ఎఫ్సీడీ ఉప సంచాలకుడు మహేష్ కుమార్, రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ శశాంక్ శేఖర్ రాజ్, ఎన్ఆర్ఎస్సీ-ఐఎస్ఆర్ఓ శాస్త్రవేత్త సాయి భగీరథ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు.కేంద్ర బృందం చీరాల, వేటపాలెం, కారంచేడు మండలాల్లో పలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. వేటపాలెం మండలం రామాపురం–వాడరేవు రహదారి వద్ద 36 మీటర్ల మేర దెబ్బతిన్న రహదారి, కూలిన కల్వర్టులు, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ వద్ద 80 మీటర్ల మేర ధ్వంసమైన రహదారులను బృందం పరిశీలించింది. అలాగే కారంచేడు మండలం స్వర్ణ గ్రామం రోడ్డులో కొమ్మమూరు కాల్వకు గండ్లు పడిన ప్రదేశాలను, నీటమునిగిన పంట పొలాలను ప్రత్యక్షంగా చూశారు.రైతులు చూపించిన వరి పొలాల్లో పంట నష్టం తీవ్రంగా ఉందని బృంద సభ్యులు గమనించారు. సాధారణంగా ఒక ఎకరాకు 30–33 బస్తాలు దిగుబడి వచ్చే చోట ఇప్పుడు 10 బస్తాలు కూడా రావట్లేదని రైతులు వివరించారు. కారంచేడు కప్పల వాగు, పర్చూరు వాగు ప్రాంతాల్లో కోతకు గురైన జాతీయ రహదారి, చెరువులు, కాల్వ గట్టులను కూడా పరిశీలించారు.

జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కేంద్ర బృందానికి వివరించారు. బాపట్ల జిల్లాలో మొత్తం రూ.370.02 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. 220 గ్రామాలు దెబ్బతిన్నాయి, 30 గ్రామాలు నీట మునిగాయి. 31,490 కుటుంబాలు నష్టపోయి, 21,894 మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. మత్స్యకారులు, చేనేత కార్మికులు, రైతులు పెద్దఎత్తున నష్టాన్ని చవిచూశారని తెలిపారు.జలవనరుల శాఖకు రూ.53.04 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.76 కోట్లు, ఆర్అండ్బీ శాఖకు రూ.139 కోట్లు, వ్యవసాయానికి రూ.31.21 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.3.01 కోట్లు నష్టం జరిగినట్లు వివరించారు.బాపట్ల జిల్లాకు అపార నష్టం వాటిల్లిందని పౌసుమి బసు అన్నారు. “మేము క్షేత్రస్థాయిలో స్వయంగా చూసిన విషయాలను కేంద్రానికి తెలియజేస్తాం. రహదారులు, చెరువులు, కాల్వలు తిరిగి సాధారణ స్థితికి రావాలంటే అధిక నిధులు అవసరం. నష్టపరిహారం కోసం మా వంతు కృషి చేస్తాం” అని ఆమె హామీ ఇచ్చారు.పర్యటనలో అనుబంధ శాఖల జిల్లా అధికారులు, చీరాల ఆర్డీవో టి. చంద్రశేఖర్, బాపట్ల ఆర్డీవో పి. గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.







