
గుంటూరు నగరపాలక సంస్థలో సోమవారం జరిగే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సర్వం సిద్దం చేయడం జరిగిందని ఎన్నికల అధికారి, జియంసి అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఈ నెల 3వ తేది సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు, ప్రిసైడింగ్ అధికారి డి.సి శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రం నందు ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్ లు, పోలింగ్ కంపార్ట్ మెంట్, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, అదనపు కమీషనర్ మాట్లాడుతూ సోమవారం నిర్వహించే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఏర్పాట్లను సర్వం సిద్దం చేశామన్నారు. పోలింగ్ సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాన్నం 3 గంటలకు ముగుస్తుందన్నారు.
ఎన్నికలలో ఓటు వేయు అభ్యర్ధులు (కార్పొరేటర్లు) మాత్రమే నగర పాలక సంస్థ కార్యాలయం మరియు ఎన్నికల కేంద్రంలోకి అనుమతి ఉంటుందని చెప్పారు. ఓటు వేయు ప్రతి ఒక్కరూ నగర పాలక సంస్థ జారీచేసిన గుర్తింపు కార్డుతో పోలింగ్ కు హాజరవ్వాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సిబ్బంది నియామకం మరియు శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. పోలింగ్ రోజు ఉదయం 8 గంటలకల్లా ఎన్నికల విధులకు హాజరుకావాలన్నారు. ఎన్నికల నిర్వహణకు మూడంచెల భద్రత మరియు పోలీస్ బందో బస్తుతో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే లాలాపేట పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారన్నారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని, అనంతరం ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సేక్రటరి పి. శ్రీనివాసరావు, ఓటర్ల గుర్తింపు అధికారి మరియు నగర పాలక సంస్థ మేనేజర్ షేక్ బాలాజీ బాషా, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పద్మనాభరావు పాల్గొన్నారు.







