
పల్నాడు: నవంబర్ 11:-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు రోడ్‌లోని జగనన్న కాలనీని సందర్శించారు. కాలనీలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు—“గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలంలో జగనన్న కాలనీ కోసం 110 ఎకరాల స్థలాన్ని సేకరించి 5001 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. వాటిలో వెయ్యి ఇళ్లు పూర్తయ్యాయి. సుమారు 600 కుటుంబాలు ఇప్పటికే నివసిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మారిన 18 నెలల కాలంలో ఇక్కడి రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది.

గుంతల మయం అయిపోయాయి, లైట్లు లేవు, రాత్రిళ్లు వెళ్ళడం ప్రమాదం. మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది—ప్రజలు మినరల్ వాటర్ కొనుక్కుని తాగాల్సి వస్తోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి గోపిరెడ్డి అన్నారు.“కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా ప్రజలకు నీరు సరఫరా చేయాలి. కాలనీ నుంచి మెయిన్ రోడ్‌వరకు రోడ్డు వెంటనే వేయాలి. వర్షాలు పడితే ప్రజలు బయటకు రావడం కూడా కష్టమవుతోంది. మేమే సబ్‌స్టేషన్ నిర్మించి ప్రారంభించాం, కానీ ఇప్పుడో లైటు కూడా వేయలేని దుస్థితి కూటమి ప్రభుత్వానికి వచ్చింది.”

స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు దసరాకే రోడ్డు ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని, ఇక కాలనీ పేరు కూడా మార్చి జగనన్న కాలనీను ఎన్టీఆర్ కాలనీగా మలిచారని ఆయన విమర్శించారు.
“పేరు మార్చుకోవడంలో తప్పులేదు, కానీ పేరు పెట్టుకున్నందుకైనా రోడ్లు, లైట్లు వేయండి. పేరు గొప్పగా ఉంటుంది కానీ పనులు జీరోగా ఉన్నాయి,” అని వ్యంగ్యంగా అన్నారు.అలాగే, కూటమి ప్రభుత్వం 18 నెలలు అయినా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని, కొత్త రోడ్డు వేయలేదని విమర్శించారు.“చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం 100 కోట్లు ఖర్చుపెట్టి హెలికాఫ్టర్‌లో తిరుగుతున్నాడు. కానీ కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. కోటప్పకొండకు 4.50 కోట్లు శాంక్షన్ అయ్యినా రోడ్డు ప్రారంభించలేదు. దేవాలయానికి వచ్చిన ఆదాయం ఎక్కడ పోతుంది?” అని ప్రశ్నించారు.“కోటప్పకొండపై కొబ్బరికాయ 50 రూపాయలు, వాటర్ బాటిల్ 30 రూపాయలు — ఇవన్నీ ఈరోజే ఎల్లో మీడియా పత్రికలో వచ్చిన వార్తలు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైసీపీ హయాంలో 10,000 సచివాలయాలు ఏర్పాటు చేశాం, కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం 70,000 బెల్ట్ షాపులు తెరుస్తోంది.
సచివాలయాల పేర్లు మార్చి ‘విజన్ యూనిట్స్’ అని ఇంగ్లీష్ పేర్లు పెడుతున్నారు. ఇది తెలుగు భాషను నిర్వీర్యం చేయడమే. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువారి కోసం అని చెబుతారు, కానీ చంద్రబాబు నాయుడు తెలుగు పేర్లను తొలగించి ఎన్టీఆర్ ఆశయాలకు మంటలు అంటిస్తున్నాడు,” అని మండిపడ్డారు.ఆర్టీసీ ఉచిత బస్సు పథకంపై కూడా గోపిరెడ్డి తీవ్రంగా స్పందించారు.“ఉచిత బస్సు పథకం పేరిట ఆర్టీసీకి 600 కోట్లు బకాయిలు అయ్యాయి. డీజిల్ కొనడానికి కూడా డబ్బులు లేవు. కొత్త బస్సు ఒక్కటిని కూడా కొనలేదు. పేదల కోసం ఈ ప్రభుత్వం చేసినది ఏమీ లేదు. చంద్రబాబు, లోకేశ్ చార్టెడ్ ఫ్లైట్లలో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు,” అని ఆయన దుయ్యబట్టారు.చివరిగా ఆయన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ,“జగనన్న కాలనీని స్వయంగా సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణమే రోడ్లు, లైట్లు, మంచినీటి వసతులు కల్పించాలి,” అని కోరారు.







