
Guntur:అమరావతి: నవంబర్ 21 :-అనారోగ్యంతో బాధపడుతున్న అంబేద్కర్ గురుకుల విద్యార్థికి చికిత్స నిమిత్తం సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బోనెల చరణ్ గత కొన్ని రోజులుగా జీబీ సిండ్రోమ్‌తో బాధపడుతున్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది. వెంటనే అధికారులు సంబంధిత చర్యలు తీసుకునేలా మంత్రి ఆదేశించారు. మొదట విద్యార్థిని విశాఖపట్నం కేజీహెచ్‌లో చేర్పించి వైద్యం ప్రారంభించగా, మరింత మెరుగైన చికిత్స కోసం విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.

వైద్య ఖర్చులు భారమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంతో మంత్రి డా. స్వామి స్వయంగా సంప్రదించగా, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా రూ.10 లక్షల సాయం శుక్రవారం మంజూరు చేశారు.ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ—“పేదింటి విద్యార్థి ప్రాణాలను కాపాడిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పేద విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది నిదర్శనం” అని అన్నారు.
అంతేకాక, ఇప్పటి వరకు అనారోగ్యానికి గురైన 37 మంది అంబేద్కర్ గురుకులాలు మరియు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక చొరవతో ఉచిత వైద్యం అందించించి ప్రాణాలు కాపాడినట్టు మంత్రి వెల్లడించారు.










