
బాపట్ల:22-11-25:-జిల్లాలోని మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.కలెక్టర్ మాట్లాడుతూ…
గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడం, ప్రీ–స్కూల్ విద్యార్థుల అభ్యాసానికి అనుకూల వాతావరణం కల్పించడం లక్ష్యంగా మినీ కేంద్రాలను సాధారణ కేంద్రాలుగా మార్చుతున్నామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 16 మినీ అంగన్వాడీ కేంద్రాలన్నింటిని అప్గ్రేడ్ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. కమిటీ ఆమోదం పొందిన వెంటనే ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని తెలిపారు.
మార్పుల వల్ల లభించే ప్రయోజనాలపై మాట్లాడుతూ— గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం సకాలంలో అందించడానికి ఈ అప్గ్రేడ్ తోడ్పడుతుందని చెప్పారు. అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనం కూడా రూ.7,000 నుంచి రూ.11,500కు పెరగనున్నట్లు వివరించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కేంద్రాల్లో మార్పులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, డీఈఓ పురుషోత్తం, బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.







