
హైదరాబాద్ :22-11-25:- రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46 బీసీలను మోసం చేసే నిర్ణయమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతం లోపు రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు మార్గదర్శకాలు జారీ చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన, బీసీలను దగా చేసే జీవో 46ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రెండు రోజుల్లో అన్ని బిసి సంఘాలతో సమావేశమై విపులమైన ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తామని హెచ్చరించారు.
బిసిల రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, ప్రభుత్వం ముందుగానే చేతులెత్తేయడం అర్థరహితమని కృష్ణయ్య విమర్శించారు. కోర్టులో నిబద్ధతతో పోరాడాల్సిన ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయడం అనుమానాస్పదమన్నారు.42 శాతం బిసి రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికలను వాయిదా వేసి, కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని కోరిన ఆయన, లేని పక్షంలో బిసిల తిరుగుబాటు తప్పదని స్పష్టం చేశారు.







