
భారత రాజ్యాంగం గొప్ప స్ఫూర్తిదాయకమని జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవంను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్.అంబేద్కర్ చిత్ర పటానికి డి.ఆర్.ఓ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం.. ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు.nభారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలాధారమైన భారత రాజ్యాంగంను 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిందన్నారు. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన మరియు సమగ్రమైన రాజ్యాంగంగా గుర్తింపు పొందిందని వివరించారు. భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, ప్రజాస్వామ్య గణతంత్రంగా నిర్వచిస్తూ, ప్రతి పౌరుడికి మౌలిక హక్కులు, బాధ్యతలు, స్వేచ్ఛ ప్రసాదించడం జరిగిందని చెప్పారు. పౌరుల హక్కులను రక్షించే గొప్ప వ్యవస్థ ఏర్పాటుకు రాజ్యాంగం కారణమని, ప్రభుత్వ వ్యవస్థల పనితీరుకు స్పష్టమైన మార్గ నిర్దేశం ఇచ్చిందన్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అందించి ప్రతి ఒక్కరికీ సమన్యాయం నిర్దేశించిన ఘనత రాజ్యాంగానిది అన్నారు. భారతదేశ సమగ్రత, ఐక్యతను కాపాడే శక్తిగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన డా. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణానికి ప్రధాన శిల్పిగా ఆయన కొనియాడారు. అంబేద్కర్ దూరదృష్టి, న్యాయ నిబద్ధత భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచాయన్నారు. రాజ్యాంగం కేవలం పుస్తకంలో ఉన్న పాఠ్య గ్రంథం కాదని, ప్రతి భారత పౌరుడు అనుసరించవలసిన జీవన విధానమన్నారు. ప్రజల్లోని రాజ్యాంగ అవగాహన, బాధ్యతాపై ప్రజాస్వామ్య బలం ఆధారపడి ఉంటుందన్నారు. “రాజ్యాంగం మనకు హక్కులను ఇస్తుంది… అదే సమయంలో మన బాధ్యతలను గుర్తు చేస్తుంది.” అన్నారు. ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛ, సమ న్యాయం, సమాన హక్కులు ఇస్తూ సమాజంలో నడవడిక, విలువలు కలిగి ఉండటం వంటి అనేక అంశాలను ఉద్భోదిస్తూ నిత్య జీవితంలో గొప్ప మార్గదర్శిగా, నిరంతర రక్షకునిగా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠిక (Preamble)ను చదివి అందరిచే ప్రతిజ్ఞ గా చేయించారు. రాజ్యాంగ విలువలను పాటించేందుకు సంకల్పంగా పీఠిక పఠనం పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, జిల్లా మత్స్య శాఖ అధికారి పి.ఎన్.కిరణ్ కుమార్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి పూర్ణచంద్ర రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







