
విజయవాడ: నవంబర్ 26:-విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున నగర ప్రధాన కార్యదర్శి చీర్ల రామస్వామి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని, అలాగే నిల్వలో ఉన్న సుమారు 45 వేల క్లైములను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.భాను నగర్‌లో బిల్డింగ్ వర్కర్ల సమస్యలను తెలుసుకునేందుకు యూనియన్ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా సంక్షేమ బోర్డు పునరుద్ధరణ కోసం సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక పూట పని దొరికినా, మరో పూట పని లేక కుటుంబాలు బాదరబందిగా పోతున్నాయని, పిల్లల ఆహార సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు రామస్వామికి విన్నవించారు.“సంక్షేమ బోర్డు ఉంటే యూనియన్ కార్డు ఆధారంగా లభించే క్లైములు మా కుటుంబాలకు ఆదుకుంటాయి” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
యూనియన్ నగర అధ్యక్షుడు బెవర శ్రీనివాసరావు మాట్లాడుతూ —“భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధి రోడ్ల మీద పడిపోయిన ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఆకలి మంటలు అగ్గిపెట్టెలా రగలకముందే బోర్డు చైర్మన్‌ను నియమించి, నిర్మాణ కార్మికుల సమస్యలను శీఘ్రం పరిష్కరించాలి” అని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో చల్లా వెంకటరమణ, రెడపంగు ప్రభుదాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.







