
పెన్షనర్లకు ఉదయం 6 గంటల నుండే వారి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, పెన్షన్ వారికి భరోసా కల్పిస్తున్నందున వారికి 1వ తేదీనే నూరు శాతం పంపిణీకి వార్డ్ సచివాలయాల వారీగా కార్యాచరణ మేరకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం స్థానిక కొండావారి వీధి, మాచిరాజువారి వీధి ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గుంటూరు నగరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. నగరంలోని 206 వార్డ్ సచివాలయాల పరిధిలో వృధ్యాప్య, వితంతు, వికాలాంగులు, ఒంటరి మహిళా వంటి 27 కేటగిరిలు వారీగా ఉన్న 57,762 మంది పెన్షనర్లకు రూ.25,12,59,500లను వారి ఇంటి వద్దనే 1632 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. పెన్షన్ ల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణకు 57 మంది నోడల్ అధికారులను నియమించి, ప్రతి గంటకు రిపోర్ట్ తీసుకొని, పించన్ల పంపిణీ వేగవంతంకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.







