
సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి వంటి వ్యవస్థలను నిర్మూలన చేయవచ్చనిజిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం 1976 (బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్) – నిఘా మరియు అమలు కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేసి వెట్టిచాకిరి వంటి వ్యవస్థ లేకుండా చూడాలని అన్నారు. సామాజిక స్పృహ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. మానవతా దృక్పథం ఉండాలని స్పష్టం చేశారు. చట్టాలపై అవగాహన పొందాలని సూచించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని వివిధ రకాలుగా అమలు చేసి సామాజిక రుగ్మతల నుండి విముక్తి కలిగించవచ్చని చెప్పారు. చెత్త కుప్పలపై వివిధ పదార్థాలు సేకరిస్తున్న వారిని కూడా గమనించడం జరిగిందని, అటువంటివారి రక్షణకు కూడా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రేషన్ పనిచేసే ప్రదేశాల్లో యాప్ ద్వారా తీసుకునేందుకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధి ప్రియాంక వెట్టిచాకిరి నిరోధక చట్టం 1976ను గూర్చి వివరించారు. బాండెడ్ లేబర్ పిర్యాదును ఎవరైనా చేయవచ్చని తెలిపారు. బృందంగా వెళ్ళి తనిఖీలు నిర్వహించడం వలన మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ.గాయత్రి దేవి, జిల్లా విద్యా శాఖ అధికారి సి.వి. రేణుక, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, సభ్యులు గండి కోటేశ్వర రావు, ఈమని చంద్ర శేఖర్, బెల్లంకొండ శంకర రావు తదితరులు పాల్గొన్నారు.







