
బాపట్ల: 05-12-2025:-నిషేధిత భూముల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ న్యూ విసి హాల్‌లో రెవెన్యూ అధికారులతో ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.కలెక్టర్ మాట్లాడుతూనిషేధిత భూముల జాబితాలో నమోదైన వివరాలను ప్రతి దరఖాస్తు మేరకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. బాపట్ల, ఇంకొల్లు, యద్దనపూడి, వేటపాలెం, మార్టూరు, అద్దంకి మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులతో కలిసి నిశితంగా ఆరా తీశారు. ఆయా దస్త్రాలతో పాటు ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌లో ఉన్న వివరాలను కూడా ఆయన పరిశీలించారు.
చట్టబద్ధమైన యజమానులకు హక్కులు కల్పించే దిశగా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, ఉప కలెక్టర్ లవన్న, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి అల్తాఫ్ తదితర అధికారులు పాల్గొన్నారు.







