
బాపట్ల : కర్లపాలెం:మెగా పేరెంట్స్ మీటింగ్స్ పిల్లల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయని సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్ర ప్రదేశ్ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు.కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ పరిధిలోని కొత్త నందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాల్లో గల నాలుగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా ముచ్చటించి పాఠశాలల్లో జరుగుతున్న బోధన, సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్స్ ఒక మంచి నిర్ణయమని పేర్కొన్న తాండ్ర సాంబశివరావు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫారం, పుస్తకాలు, స్టేషనరీతో సహా అన్ని రకాల కిట్స్‌తో పాటు మధ్యాహ్న భోజన పథకం కింద రుచికరమైన ఆహారం అందిస్తుండటాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేవలం విద్య ద్వారానే అంబేద్కర్, అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మహనీయులు దేశానికి మహానుభావులయ్యారని, వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు అభివృద్ధి చెందాలని సూచించారు.కొత్త నందాయపాలెం గ్రామంలో జరిగిన సమావేశంలో పాఠశాల అభివృద్ధి కోసం పలు సూచనలు చేసిన ఆయన, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించబడుతున్న ఫ్రీ స్కూల్ కిట్స్‌ను ఆవిష్కరించి అంగన్వాడీ టీచర్లకు, పిల్లలకు అందించారు.విద్యార్థులకు మంచి విద్య అందిస్తున్న ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, గ్రామ పార్టీ ఇంచార్జ్ మునిపల్లి చిన్నా, జనసేన ఇంచార్జి గరిగంటి శ్రీనివాసరావు, సాయిని రాంబాబు, విద్యా కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.







