మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన అమెరికాకు చెందిన మాక్సీ హోటల్స్ గ్రూప్ ఇన్వెస్టర్స్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబర్ లో అమెరికాకు చెందిన మ్యాక్సీ హోటల్స్ కు సంబంధించిన పెట్టుబడిదారులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగంలో ప్రధానంగా అతిథ్య(హాస్పిటాలిటీ) రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వారు మంత్రితో అన్నారు. మాక్సీ హోటల్స్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని, పర్యాటకులకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పించడం తమ ధ్యేయమన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా తమ హోటల్స్ విస్తరించి ఉన్నాయని వారు వివరించారు. అనంతరం పర్యాటక రంగ అభివృద్ధిలో పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామని, పర్యాటక రంగానికి రాష్ట్రంలో పరిశ్రమ హోదా ఉందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వివరించారు. అదే విధంగా నూతన పర్యాటక పాలసీ విధి విధానాలు, ప్రభుత్వం తరపున అందిస్తున్న రాయితీలను మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ సందర్భంగా పెట్టబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్ ఆసక్తి కనబరచగా అందుకు మంత్రి దుర్గేష్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సరైన డీపీఆర్, ప్రణాళికలతో వస్తే ప్రభుత్వం తరపున సహకరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ భరోసానిచ్చారు. ఇటీవల పర్యాటక రంగంలో రూ.1200కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, 8 కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు..