
ప్రభుత్వ గుర్తింపు పొందిన అనాథాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ పిల్లల సంక్షేమం దృష్టా డా.ఎన్టీఆర్ వైద్యసేవ / అమృత హెల్త్ స్కీమ్ ను అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అమృత హెల్త్ కార్డులను చిన్నారులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన 39 మంది లబ్దిదారులకు ప్రత్యేక అమృత హెల్త్ కార్డులు ముద్రించి పంపిణీ చేయడం జరిగిందన్నారు. డా. ఎన్టీఆర్ వైద్యసేవ గుర్తింపు పొందిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో పూర్తిగా నగదు రహిత (క్యాప్టోస్) వైద్యం అందుతుందని, మొత్తం 3257 శస్త్రచికిత్సలు / చికిత్సా విధానాలకు అర్హత ఉందన్నారు. సంబంధిత అనాథాశ్రమాల ద్వారా సరళమైన రిఫరెల్ విధానం ఉంటుందని చెప్పారు. లబ్దిదారులకు సమయానుకూలంగా, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనాథాశ్రమాల్లోని అనాథ పిల్లలకు ఉచితంగా అధునాతన వైద్యం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. వివరాలు, సహాయం కోసం గుంటూరు జిల్లా డా. ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా సమన్వయాధికారిను సంప్రదించవచ్చని సూచించారు. అనాథ పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాల్లో అమృత్ ఆరోగ్య పథకం ఒకటని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, డా. ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా సమన్వయ అధికారి విజయ్ పాల్గొన్నారు.







