
జిల్లాలో స్క్రబ్ టైఫస్’ జ్వరాల వలన మరణాలు సంభవించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వైద్య ఆరోగ్యశాఖ ను సమన్వయం చేసుకుంటూ పంచాయతీ, రెవెన్యూ శాఖలు ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా స్క్రబ్ టైఫస్’ జ్వరాల నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, హౌసింగ్ , ఉపాధి హామీ పథకం పనులు, గ్రామ వార్డు సచివాలయ సేవలు తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పీహెచ్సీ వైద్యులు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో చిగ్గర్ మైట్ (కీటకం) ప్రభావం కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్’ జ్వరాల వస్తాయని, గత కొన్ని సంవత్సరాలుగా ఈ జ్వరాలు నమోదు అవుతున్న, ప్రస్తుతం దీని వలన తీవ్ర అనారోగ్యం, మరణాలకు దారి తీస్తుందని అని చెప్పారు. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివపించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చిన్న నల్ల మచ్చ (దద్దురు మాదిరిగా) శరీరంపై కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైపస్ గా అనుమానించవచ్చునని తెలిపారు. జ్వరం వచ్చి మూడు రోజుల వరకు తగ్గకుంటే జీ జీ హెచ్ కు వచ్చి రక్త పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ జ్వరాలకు ఉపయోగించే మందులు ఉప ఆరోగ్య కేంద్రాల్లో (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్క్రబ్ టైపస్ జ్వరలపై పూర్తిస్థాయిలో ప్రజలు అవగాహన కలిగించేలా గ్రామాల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించేలా ఎంపీడీవోలు పర్యవేక్షించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించిన విధంగా నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ అధికారులు నిరంతరం పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో గృహ నిర్మాణానికి సంబంధించి గతం లో లే అవుట్లలో ఆప్షన్ 3లో ఇళ్ళు నిర్మించిన కాంట్రాక్టుర్ల పనులను పరిశీలించి డీవియేషన్లు ఉంటే వాటిని సరిచేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించని కాంట్రాక్టర్లపై చర్యలకు సిఫార్సు చేయాలన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 3డీ మోడల్ లో గృహాల నిర్మాణానికి అనువుగా ఉన్న లేఔట్లను గుర్తించాలన్నారు, ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసిన పశువుల పాకలు వచ్చే వారం నాటికి నూరు శాతం గ్రౌండ్ చేసి డిసెంబర్ 15 నాటికి పూర్తి అయ్యేలా ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో జరిగే సర్వేల రోజువారీ వివరాల డైరీ సచివాలయ ఉద్యోగులు నిర్వహించేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగులు అందిచే పీజీఆర్ఎస్ అర్జీల ఎండార్స్మెంట్ లపై ఉద్యోగి పేరు , సచివాలయం వివరాల రబ్బర్ స్టాంప్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయల ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు శాతం మెరుగుపరిచేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. విజయలక్ష్మి మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్ జ్వరాల లక్షణాలు, చికిత్స, అనుసరించాల్సిన ఇతర పద్ధతులను వివరించారు. పొలం పనులకు వెళ్లే వారు రబ్బరుతో తయారుచేసే షూలు ధరిస్తే మంచిదని, పాత మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవడం మంచిదన్నారు, నివాసం ఉండేచోట ఎలుకలు సంచరించకుండా చూసుకోవాలన్నారు.నేలపై నిద్రించే సమయంలో దుప్పట్లు ఉపయోగించాలన్నారు. రాత్రి వేళల్లో ఒంటిని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించటం తదితర ముందస్తు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో వి జ్యోతి బసు , సీపిఓ శేషశ్రీ, జిల్లా హౌసింగ్ పీడీ ప్రసాదు, డ్వామా పీడి శంకర్ పాల్గొన్నారు.







