
గుంటూరు: డిసెంబర్ 08:-రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత, వినియోగదారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA) అత్యంత నిబద్ధతతో పనిచేస్తోందని ఎపీ రెరా ఛైర్ పర్సన్ ఆరే శివారెడ్డి తెలిపారు. రాయపూడిలోని సి.ఆర్.డిఏ కార్యాలయం నాలుగో బ్లాక్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఏజెంట్ తప్పనిసరిగా ఎపీ రెరా అధికారిక వెబ్‌సైట్ ద్వారా (www.rera.ap.gov.in) ఆన్‌లైన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల నమోదు కోసం అవసరమైన పత్రాలు సక్రమంగా అందించిన వెంటనే నిర్దేశిత కాలవ్యవధిలో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
వినియోగదారుల రక్షణే లక్ష్యం-రియల్ ఎస్టేట్ నియంత్రణ అభివృద్ధి చట్టం ద్వారా గృహ కొనుగోలుదారులకు నమ్మకమైన, పారదర్శకమైన లావాదేవీలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వ్యాపారులు వినియోగదారులకు అవాస్తవ వాగ్దానాలు చేస్తే, రెరా దగ్గరకు ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రతి నెల ఒక జిల్లాలో అవగాహన కార్యక్రమాలురియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న స్టేక్‌హోల్డర్లకు అవగాహన పెంచే ఉద్దేశంతో, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 2025 డిసెంబర్ 10 నుంచి 2026 డిసెంబర్ వరకు ప్రతినెల ఒక జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు తిరుపతి జిల్లాతో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.వ్యాపారులకు కీలక సూచనలుస్థిరాస్తి వ్యాపారులు వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, అసాధ్యమైన హామీలతో ప్రజలను మోసం చేయరాదని శివారెడ్డి హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి వినియోగదారులకు అందించాలన్నారు. వ్యవస్థను సరళతరం చేసేందుకు బిల్డింగ్ రూల్స్, లేఅవుట్ నిబంధనల్లో ప్రభుత్వం అనేక మార్పులు చేసినట్లు తెలిపారు.వినియోగదారులను మోసగించే సంస్థలపై రెరా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రజల జీవితకాల స్వప్నమైన గృహాన్ని నాణ్యతతో అందించడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.ప్రాజెక్టుల నమోదు – తాజా వివరాలుఎపీ రెరా డైరెక్టర్ కె. నాగసుందరి మాట్లాడుతూ2025 జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 1011 దరఖాస్తులు అందగా,వాటిలో 731 ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేశామని చెప్పారు.కొత్త పాలకవర్గం ఏర్పడిన రెండు నెలల్లో 214 ప్రాజెక్టులు, 27 మార్కెటింగ్ ఏజెన్సీలు నమోదు అయ్యాయని తెలిపారు.500 చదరపు మీటర్లకు పైగా లేదా 8 యూనిట్లకు మించి ఉన్న అన్ని అపార్ట్మెంట్, లేఅవుట్ ప్రాజెక్టులు తప్పనిసరిగా రెరాలో నమోదు కావాలని స్పష్టం చేశారు. పూర్తయ్యే ప్రాజెక్టులు క్లోజర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 115 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.ప్రతి మూడు నెలలకు ప్రాజెక్టుల పురోగతి రిపోర్టులను సమర్పించాలన్నారు. నమోదు కాని ప్రాజెక్టులు, అసంపూర్ణ దరఖాస్తులు, కాలానికి పూర్తి కాని పనులపై నోటీసులు జారీ చేస్తున్నట్లు వివరించారు.వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి వారానికి రెండు సార్లు బెంచ్ నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 285 ఫిర్యాదులపై ఆర్డర్లు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం రేరా కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.సమావేశంలోఏపీ రెరా సభ్యులు ఏ. జగన్నాథరావు, ఎం. వెంకటరత్నం, డి. శ్రీనివాసరావు, యు.ఎస్.ఎల్.ఎన్. కామేశ్వరరావు, జె. కులదీప్ పాల్గొన్నారు.







