
బాపట్ల : 8-12-2025:-జిల్లా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు సమయానుసారంగా, చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.జిల్లా నలుమూలల నుండి అందుతున్న అర్జీలను అధికారులు నిల్వ పెట్టకుండా వెంటనే స్పందించాలని సూచించారు. ఆన్లైన్‌లో పంపిన అర్జీలను కొంతమంది అధికారులు ఇప్పటికీ పరిశీలించడం లేదని గుర్తించిన కలెక్టర్, ఇలాంటి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మండలం, విభాగాల వారీగా అర్జీల పరిశీలనలో మార్టూరు మండలానికి అధిక అర్జీలు రావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఫ్రీ ఆడిట్ వ్యవస్థలో కొన్ని మండలాల పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో, వాటిని జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్య ప్రముఖుల నుండి వచ్చే అర్జీలను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించారు.అర్జీల పరిష్కారంలో నాణ్యమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలి. ఒక సమస్య పునరావృతం కాకుండా అర్జీదారునికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, కార్యాలయాల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు స్పందించని అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాను మూడో స్థానం లేదా అంతకంటే మెరుగైన స్థాయిలో నిలపడం కోసం అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ విజయమ్మ, పీడీ డిఆర్డిఎ లవన్న, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.







