
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార హోల్ సేల్ కూరగాయల వ్యాపారంకు అనుమతులు లేవని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం నందివెలుగు రోడ్ లోని నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ఎదుట రోడ్ మీద జరుగుతున్న అనధికారిక కూరగాయల హోల్ సేల్ విక్రయాలను కమిషనర్ అడ్డుకొని, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి, ఇతర ప్రభుత్వ విభాగాల నుండి నిర్దేశిత అనుమతులు లేకుండా, అనధికారికంగా, అత్యంత రద్దీగా ఉండే రోడ్ పై హోల్ సేల్ కూరగాయల విక్రయాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్ సేల్ మార్కెట్ ల్లో టెండర్ ద్వారా షాప్ లు దక్కించుకున్న వారు రోడ్ల మీద జరుగుతున్న అనధికార వ్యాపారాల వలన తాము తీవ్రంగా నష్ట పోతున్నామని పలు దఫాలుగా ఫిర్యాదులు చేశారన్నారు. ప్రతి రోజు రాత్రి సమయంలో జిఎంసి పట్టణ ప్రణాళిక, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా అనధికార వ్యాపారాలు జరగకుండా పర్యవేక్షణ చేస్తారన్నారు. అలాగే కొల్లి శారద మార్కెట్ కి రోడ్ వైపుగా ఉన్న దుకాణాలను కూడా స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం పరమాయికుంట ప్రాంతంలో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసి, పనులు జరిగే సమయాల్లో ఎమినిటి కార్యదర్శులు అక్కడే ఉండి పర్యవేక్షణ చేయాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్టు లో చేర్చడంతో పాటు, కార్యదర్శిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్ఎస్ లు తమకు కేటాయించిన ట్రాక్టర్ల ద్వారా రోడ్ల పక్కన ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని ఆదేశించారు.పర్యటనలో డిఈఈ కళ్యాణరావు, హనీఫ్, ఆర్ఓ సాదిక్ భాష ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







