
గుంటూరు: డిసెంబర్ 9:-ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ వైద్య-ఆరోగ్య కేంద్రాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన డైరెక్టరేట్ సెకండరీ హెల్త్ జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ సమావేశంలో నియామకాలపై విస్తృతంగా సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ— వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 104 సేవల్లో పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని, అలాగే 10వ తరగతి జీపిఏను 9.5గా పరిగణించాలి అని తెలిపారు.నరసరావుపేట, బాపట్లలోని డి-అడిక్షన్ సెంటర్లలో వార్డ్ బాయ్, చౌకిదారు, హౌస్‌కీపింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్లను ఖచ్చితంగా పాటించాలని అధికారులు చెప్పారు. అదనంగా వయస్సు, స్థానిక అభ్యర్థులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో డీఎంఒ డా. విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.







