
గుంటూరు: మంగళగిరి– డిసెంబర్ 9:-రాష్ట్రంలో రూ.11.12 కోట్ల వ్యయంతో నిర్మించిన 11 నూతన ఔషధ పరిపాలనా భవనాలు, ప్రాంతీయ ప్రయోగశాలలను వైద్య–ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరిలోని శాఖ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి ఈ భవనాలకు శుభారంభం పలికారు.ప్రారంభించిన పరిపాలనా కార్యాలయాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, అమలాపురం, నరసరావుపేట, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, కర్నూలు ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం, కర్నూలు కేంద్రాలకు అనుబంధంగా కొత్త ప్రాంతీయ ప్రయోగశాలలను కూడా ఏర్పాటు చేశారు. 43,000 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనాల వల్ల సంవత్సరానికి సుమారు రూ.15 లక్షల అద్దె భారాన్ని ప్రభుత్వం ఆదా చేసుకోనుంది.ప్రయోగశాలల సామర్థ్యం పెరుగుతోందిప్రస్తుతం విజయవాడలోని రాష్ట్ర ల్యాబ్ ఏడాదికి 4,000 మందుల నమూనాలను మాత్రమే పరీక్షిస్తోంది. కొత్త ల్యాబుల ప్రారంభంతో అదనంగా 3,000 నమూనాలు పరీక్షించే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. విజయవాడలో నిర్మాణంలో ఉన్న స్టేట్ ల్యాబ్ మరో మూడు నెలల్లో వినియోగంలోకి రానుంది. దీని ద్వారా మొత్తం 13,000 నమూనాలను పరీక్షించే సామర్థ్యం ఏర్పడనుంది.
ల్యాబ్‌లలో ఆధునిక పరికరాల కోసం రూ.6 కోట్లు ఖర్చుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ల్యాబుల ప్రారంభం వల్ల నమూనాల రవాణా సమయం తగ్గడంతో పాటు కల్తీ మందులు, గడువు ముగిసిన మందులపై నిఘా మరింత బలపడనుంది అన్నారు.జన ఔషధి దుకాణాల విస్తరణరాష్ట్రంలో ప్రతి మండలంలో ఒక జనఔషధి దుకాణం స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి ఇచ్చారని, త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమృత్ ఫార్మసీల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే భారీగా ఆర్థిక లాభం కలుగుతోందని పేర్కొన్నారు.ఖాళీ పోస్టుల భర్తీ– అవినీతిపై కఠిన చర్యలుఔషధ నియంత్రణ శాఖలో ఖాళీగా ఉన్న ఎనలిస్టులు, ఇతర పోస్టులను మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా త్వరలో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆకస్మిక తనిఖీల్లో 152లో 148 మందుల దుకాణాల్లో లోపాలు బయటపడ్డాయని వెల్లడించారు.కొంతమంది అధికారులు ప్రలోభాలకు లోనవుతున్నారని తేలిందని, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు. మందుల నాణ్యతలో నిర్లక్ష్యం మరెవరి ప్రాణానికి ప్రమాదమవుతుందని గుర్తించి జాగ్రత్తగా డ్యూటీ నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీడీడీ డైరెక్టర్ జనరల్ గిరీశా, రాష్ట్ర డైరెక్టర్ ఎంపీఆర్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.







