అమరావతి: డిసెంబర్ 9:-స్క్రబ్ టైఫస్ నివారణ కోసం జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై చేపట్టిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పరిస్థితులు, చికిత్స, నియంత్రణ చర్యలను ఆయన సమీక్షించారు.ప్రస్తుతం రాష్ట్రంలో 1,592 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని, అందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులున్నాయని అధికారులు వివరించారు. ఈ వ్యాధి కారణంగా మరణాలు సంభవించలేదని, నమోదైన 9 మరణాల్లో ఇతర ఆరోగ్య సమస్యలే కారణమని వెల్లడించారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉందని అధికారులు నివేదించారు.స్క్రబ్ టైఫస్ పూర్తి నిర్మూలనకు విస్తృత ప్రచారం నిర్వహించాలని, జాతీయ–అంతర్జాతీయ నిపుణుల టాస్క్‌ఫోర్స్ సమగ్ర నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులురాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సీజనల్ వ్యాధులు 48% మేరకు తగ్గాయి.డెంగ్యూ కేసులు 56% తగ్గి 5,555 నుంచి 2,452కు చేరాయిమలేరియా కేసుల్లో 11% తగ్గుదలచికున్ గున్యా కేసులు 46.5% తగ్గుదలజపనీస్ ఎన్సెఫలిటిస్ కేసులు 11 నుంచి 2కు తగ్గాయిపరిశుభ్రత పెంపు, నిరంతర ప్రచారం, విస్తృత స్థాయి పరీక్షలు, ముందు జాగ్రత్త చర్యల వల్ల ఈ తగ్గుదల నమోదైందని అధికారులు తెలిపారు.
అపరిశుభ్రతే అసలు జబ్బు… సమన్వయంతో వ్యాధులను సున్నా స్థాయికి తీసుకురావాలిసమీక్ష అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు, “సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే. దాన్ని తొలగిస్తే అనేక వ్యాధులను దూరం చేయవచ్చు” అని స్పష్టం చేశారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులను పూర్తిగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల్లో నిత్యం చైతన్యం పెంచే కార్యక్రమాలు కొనసాగించాలని కూడా సూచించారు.సమీక్ష సమావేశంలో వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్, కమిషనర్ వీరపాండ్యన్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓ దినేష్ కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ గిరీశా తదితరులు పాల్గొన్నారు.