
గుంటూరు: డిసెంబరు 9:-ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ విషయంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. అనంతరం పల్స్ పోలియో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.కలెక్టర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పల్స్ పోలియో చుక్కలు వేయాలని పిలుపునిచ్చారు. ఇటుక భట్టీలు, నిర్మాణ స్థలాలు, సంచార జాతులకు చెందిన కుటుంబాలు వంటి రిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. “రెండు చుక్కలు – నిండు ప్రాణాలు” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పోలియో శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచిస్తూ, వైద్య ఆరోగ్య, అంగన్వాడీ, విద్యా, మున్సిపల్, డీ.ఆర్.డీ.ఏ, మెప్మా, సంక్షేమ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని కలెక్టర్ ఎత్తిచూపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 22.46 లక్షల జనాభాలో ఐదు సంవత్సరాల లోపు 2,14,981 చిన్నారులు ఉన్నారని తెలిపారు. మొత్తం 784 రిస్క్ ప్రాంతాలు గుర్తించి, 958 పోలియో బూత్‌లు, 16 ట్రాన్సిట్ పాయింట్లు, 6 బఫర్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 104 రూట్లు, 72 మొబైల్ టీంలు, 4,090 వ్యాక్సినేటర్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి 2,57,980 డోసులు, 12,899 వయల్స్ అవసరం కాగా, ఇప్పటికే 13,250 వయల్స్ అందాయని వివరించారు. మొత్తం 4,406 మంది వైద్య, విద్యా శాఖ సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు.తరువాత అధికారులు కలిసి పల్స్ పోలియో పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో ఇమ్యూనైజేషన్ అధికారి ఏ. శ్రావణ్ బాబు, డీసీఎంహెచ్ఓ రంగారావు, అదనపు డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. అన్నపూర్ణ, డీపీఎంఓ డా. కె. సుజాత, మెప్మా పీడీ టి. విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, డీ.ఆర్.డీ.ఏ పీడీ టి. విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారిణి సీ. రేణుక, జీఎంసీ సీఎంహెచ్ఓ డా. పి. శశికళ, ఐఎంఏ ప్రెసిడెంట్ డా. సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు.







