
బాపట్ల:-11-12-25:- నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజలి జిల్లా పరిషత్ హైస్కూల్లో పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు కొంతసేపు టీచర్‌గా మారి విద్యార్థులకు విలువైన జీవిత పాఠాలను బోధించారు.ఈ సందర్భంగా ప్రముఖ అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ రూపొందించి, భారత ప్రభుత్వ కాపీరైట్స్ శాఖ నుండి పేటెంట్ హక్కులు పొందిన **‘ప్రతిజ్ఞ పాఠం’**ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ప్రతిజ్ఞలోని ముఖ్య అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు.
నేటితరంలో విద్యార్థులు తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం పెంపొందించుకోవాలని, మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా సూక్ష్మ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జీవితంలో ఎదుగుదలకు అడ్డుకట్ట వేసే ‘బద్ధకం’–‘నిర్లక్ష్యం’ అనే రెండు ప్రధాన శత్రువులను జయిస్తే ఏ లక్ష్యానికైనా చేరుకోవచ్చని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.సమాజంలో ఉన్నత స్థాయికి చేరిన తర్వాత తిరిగి సమాజానికి ఉపయోగపడే విధంగా కొంత సమయాన్ని వెచ్చించడం ప్రతి యువకుడి బాధ్యత అని అన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఎంతో దోహదపడతాయని ఆయన వ్యాఖ్యానించారు.విద్యార్థుల్లో మంచి మార్పుల కోసం కృషి చేస్తున్న సైకాలజిస్ట్ శ్రీమన్నారాయణను పలువురు అభినందించారు. ఎమ్మెల్యే చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న విద్యార్థులు, వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. సుగుణమణి, పూర్వ విద్యార్థి సంఘం సభ్యులు పెనుమత్స నాగరాజు (చిన్నబాబు), పేరాల రమేష్‌తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.







