
మచిలీపట్నం :-పేదల ఆశాజ్యోతి, ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మచిలీపట్నం విచ్చేసిన ఆయన కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ భావోద్వేగంగా మాట్లాడారు.
తన తండ్రిని ఇంట్లో “నాన్న” అని పిలిచినా, ప్రజల్లో మాత్రం “రంగన్న” అనే పిలుపే ఆయనకు ఎంతో ఇష్టమని తెలిపారు. “రంగన్న” అనే పేరులోనే ప్రజలతో ఉన్న అనుబంధం, ఆప్యాయత ప్రతిఫలిస్తాయని పేర్కొన్నారు.

వంగవీటి మోహన రంగా ఏ ఒక్క కులానికి, వర్గానికి లేదా రాజకీయ పార్టీకే పరిమితమైన నాయకుడు కాదని స్పష్టం చేశారు. పేదలు, బలహీన వర్గాలు, అణగారిన ప్రజలందరికీ ఆయన ఒక ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు. కులరాజకీయాలకు అతీతంగా సమాజంలో సమానత్వం కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా రంగా గుర్తింపు పొందారని చెప్పారు.Machilipatnam Local News
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. అందుకే ఆయన ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. వంగవీటి మోహన రంగా ఆశయాలు, సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆశాకిరణ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.







