
విజయవాడ:ఎన్టీఆర్ జిల్లాకు ఎంపికైన కొత్త పోలీసు కానిస్టేబుళ్లకు సంబంధించిన 9 నెలల శిక్షణపై పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు డిసెంబర్ 22 నుంచి శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో, మంగళవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. Vijayawada Localnews
ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లాకు ఎంపికైన 242 మంది కానిస్టేబుళ్లు (172 మంది పురుషులు, 70 మంది మహిళలు) పాల్గొన్నారు. శిక్షణా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధులు, ప్రవర్తనా నిబంధనలపై వారికి వివరించారు. డిసెంబర్ 16న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

పోలీసు కమిషనర్ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. శిక్షణా కాలంలో శారీరక దృఢత్వంతో పాటు టెక్నాలజీపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, శిక్షణ సమయంలో సాధించే మార్కుల ఆధారంగానే భవిష్యత్ పదోన్నతులు నిర్ణయించబడతాయని తెలిపారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులతో, ముఖ్యంగా మహిళా బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనం పాటించాలని, ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా విధులు నిర్వహిస్తే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని తెలిపారు.

ఈ తొమ్మిది నెలల శిక్షణా కాలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని అన్ని రంగాల్లో ముందుండి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికైన కానిస్టేబుళ్లకు టీషర్ట్, లోయర్ కిట్‌ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత, ఏఆర్ఏ డీసీపీ కె. కోటేశ్వరరావు, ఎంపికైన కానిస్టేబుళ్లు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.








