
వైద్య విద్యపై ఇటీవల పార్లమెంట్ స్థాయి సంఘం ఇచ్చిన నివేదికకు వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం సబబు కాదని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ తెలిపింది. ఈనెల 16వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ సమావేశమై కమిటీ రాష్ట్ర కన్వీనర్ డా|| ఆలా వెంకటేశ్వర్లు, కో కన్వీనర్లు కె.ఎస్.లక్ష్మణరావు,వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడారు. డా|| ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ పార్లమెంట్ స్థాయి సంఘ నివేదికలో పీపీపీ పద్ధతిలో కొత్త మెడికల్ కళాశాలలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహాకాలు ఇవ్వాలని పేర్కొంటే ఇందుకు విరుద్ధంగా నేటి ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు సంబంధించిన దాదాపు 600 ఎకరాల అత్యంత విలువైన భూములు, లక్షలాది చదరపు అడుగుల నిర్మాణాలు, రెండు సంవత్సరాల పాటు ప్రైవేట్ యాజమాన్యం నియమించిన వైద్యులు, ఇతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వమే జీతభత్యాలను చెల్లిస్తామని ప్రకటించడం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు పంచిపెట్టడమే నని విమర్శించారు.విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించగా, మన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పీపీపీ లో అమలు కాబోతున్న వైద్య కళాశాలపై యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని పేర్కొన్నారు గాని, ఆయా మెడికల్ కళాశాలల్లో సిబ్బంది నియమకాలపై, రిజర్వేషన్ల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర కో కన్వీనర్, శాసన మండలి మాజీ సభ్యులు కె.ఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్వహణను ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి కూటమి ప్రభుత్వం వెంటనే 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. రాష్ట్ర కో కన్వీనర్ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులందరినీ కలుపుకొని ఐక్యంగా ఉద్యమించాలని, జనవరి 9న విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించాలని, డిసెంబర్ 22న ఆధోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని, డిసెంబర్ 18న భారత కమ్యూనిస్ట్ పార్టీ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యమౌతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.







