
బాపట్ల : 16-12-2025-యువ గళం కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో జరగనున్న నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి బాపట్ల జిల్లాకు చెందిన 191 మంది ఎస్‌సీటీపీసీ అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం నియామక పత్రాలు అందజేయనున్నారు.
బాపట్ల జిల్లాకు చెందిన ఎంపికైన అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బాపట్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి 11 ఆర్టీసీ బస్సుల ద్వారా మంగళగిరికి రవాణా సదుపాయం కల్పించారు. ఈ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ పరిశీలించి, అభ్యర్థులు సురక్షితంగా కార్యక్రమానికి చేరుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కఠినమైన పోటీ పరీక్షల్లో విజయం సాధించి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఈ విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం కీలకమని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం ప్రజాసేవతో కూడిన బాధ్యత అని, విధుల్లో నిష్పక్షపాతంగా, ధైర్యంగా వ్యవహరించాలని సూచించారు.
శిక్షణ సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకుని శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వర్తించాలని అభ్యర్థులకు సూచించారు.bapatla news ఎస్‌సీటీపీసీ (సివిల్, ఏపీఎస్పీ) శిక్షణకు ఎంపికైన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, అడ్మిన్ ఆర్‌ఐ షేక్ మౌలుద్దీన్ తదితర పోలీస్ అధికారులు, అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










