
గుంటూరు నగరంలో ఉదయం 7 గంటలలోపే మెయిన్ రోడ్ల స్వీపింగ్ పూర్తి కావాలని, 7 తర్వాత ఇంటింటి చెత్త సేకరణ జరగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. బుధవారం సంగడి గుంట, కాకాని రోడ్, వాసవి నగర్, సాయి నగర్, బస్టాండ్, నందివెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉదయం 7 గంటల తర్వాత ట్రాఫిక్ పెరుగుతుందని, కనుక ఆ సమయంలోపే మెయిన్ రోడ్ల శుభ్రం పూర్తి అయ్యేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు భాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజారోగ్య కార్మికులు ఇంటింటి చెత్త సేకరణకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తడిపొడిగా వేరుగా ఇవ్వాలని గృహస్తులకు తెలియచేయాలన్నారు. సంగడి గుంట లాంచేస్టర్ రోడ్ పై బిర్యానీలు వండుతూ రోడ్ల పై గోతులకు కారణం అవుతున్న వాటిని తొలగించాలని, పునరావృతం చేస్తే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఒమేగా హాస్పిటల్ వెనుక రోడ్ లో పిజిఆర్ఎస్ లో అందిన ఫిర్యాదు మేరకు పరిశీలించి, ఆయా నిర్మాణాలకు ఆస్తి పన్ను విధించాలని, ప్లాన్ లేకుంటే తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. వాసవి నగర్, సాయి నగర్, నందివెలుగు రోడ్ ల్లో ప్రజల నుండి వివిధ వేదికల ద్వారా అందిన ఫిర్యాదుల మేరకు పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, డ్రైన్ల, కచ్చా రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నంది వెలుగు రోడ్ లో రైల్వే ట్రాక్ నుండి జాతీయ రహదారి వెంబడి డ్రైన్, రోడ్ ఆక్రమణలను తొలగించాలన్నారు. శాంతి నగర్ వైపు పీకలవాగు పై కల్వర్ట్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని డిఈఈ వెంకటరమణను ఆదేశించారు. బస్టాండ్ దగ్గరలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక ఖాళీ స్థలంలో బిటి రోడ్ నిర్మాణం చేపట్టాలని, నగరంలో జంక్షన్లలో ఉన్న ప్రతి ఫౌంటేను వర్కింగ్ లో, కమ్యూనిటి, పబ్లిక్ టాయ్ లెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటన డిఈఈలు కళ్యాణరావు, హనీఫ్, వెంకటరమణ, ఆర్ఓ సాదిక్ బాష, ఎస్ఎస్ సాంబయ్య, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







