
విజయవాడ:డిసెంబర్ 17:-రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు యువజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్.భరణి తెలిపారు.
గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న కె.ఎల్. విశ్వవిద్యాలయం వేదికగా ఈ ఉత్సవాలు జరగనున్నాయని చెప్పారు. యువతలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఉత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయిలో ఎంపికైన యువతీ యువకులు వివిధ సాంస్కృతిక, కళాత్మక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జానపద నృత్యాలు, జానపద గీతాలు, శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, నాటకాలు, చిత్రలేఖనం, కవిత్వం, కథా రచన, ప్రసంగం, క్విజ్, ఫోటోగ్రఫీ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.NTR VIJAYAWADA News
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే ఎంపికైన విజేతలకు జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు, యువజన సేవల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు సంచాలకులు ఎస్.భరణి తెలిపారు.







